Thursday, 7 September 2017

అమ్మ చీర కొంగు....

ఈ రోజు నా facebook స్నేహితురాలైన "శ్రీ వెంకట గాయిత్రి" Timeline లో ఈ క్రింది పోస్ట్ చూడటం జరిగింది. ఎవరు రాశారో గాని  "అమ్మ చీర కొంగు" అనే విషయం మీద ఇంత అద్భుతమైన వాక్యాలు ఇంత వరకు నేను వినలేదు..చదవలేదు. నాకు చాలా చాలా నచ్చింది. ఇందులోని పదాలు, వాక్యాలు అక్షర సత్యాలు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ప్రతీ వాక్యం మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

Facebook Timeline లో పోస్ట్ చేసినవారు " శ్రీ వెంకట గాయత్రి  "

#మా అమ్మ (చీర) కొంగు#
***************

ఇప్పటి పిల్లలకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే.
చీరకొంగు చీర అందానికే సొగసును పెంచేె మకుట మాణిక్యం !
అంతేకాకుండా ..పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చే ముఖ్య సాధనం !
పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం.
చంటిపిల్లలు పడుకోడానికి అమ్మ ఒడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే !
కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది 'అమ్మ కొంగు' వెనకే !
అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి !
అలాగే వాతావరణం చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !
వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగుతోనే !
వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే !
అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే !
అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాతబట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది !
ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం !
ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !!

Tuesday, 5 September 2017

హైదరాబాద్ లోని పాత బస్తీ పచ్చని అందాలు...

గమనిక:- ఈ పోస్ట్ లోని ప్రతీ ఫోటోగ్రాఫ్ నేను స్వయంగా తీసినదే.

హైదరాబాద్ పేరు వినగానే బిర్యాని, ముత్యాలు, చార్మినార్ - గోల్కొండ - సాలార్ జంగ్ వంటి చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. వీటికి ఓల్డ్ సిటీ ( హైదరాబాద్ పాత బస్తీ ) చాలా ప్రసిద్ది. హిందూ-ముస్లిం అనే భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటారు. పండగలు ఇంకా ఏ సంభరాలైనా కలిసి జరుపుకుంటారు... ఇక నా వరకైతే వీటన్నింటితో పాటు పాత బస్తీ లో అక్కడక్కడా కనిపించే పచ్చదనమంటే చాలా చాలా ఇష్టం. నేనేమి అంత పెద్ద ఫోటోగ్రాఫర్ ని కాదు. కాని ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఈ నా ఫోటోగ్రఫీ కి అస్తమానం నా మొబైల్ బలైపోతుంది ( నా వద్ద కెమెరా లేదు. నా ఆండ్రాయిడ్ మొబైల్ తప్ప. ఫోటో తీయాలని అనిపించినప్పుడల్లా నా మొబైల్ తో పని కానిస్తాను)

క్రింది ఫొటోగ్రాఫ్స్ అన్నీ నేను ఈ మధ్య తీసినవే. మేము ఎక్కువగా పి వి నర్సింహారావు ఫ్లై ఓవర్ నుండి చార్మినార్ దారిలో ప్రయాణిస్తూ ఉంటాము. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్ గంజ్ ఇవన్నీ కూడా పాతబస్తీ పరిధిలోకి వస్తాయి. చాంద్రాయణగుట్ట నుండి చార్మినార్ వెళ్ళే దారిలో రోడ్డుకి రెండు వైపులా ఉండే పచ్చదనం నన్ను కట్టిపడేస్తుంది అని ఎవరితోనైనా చెబితే నవ్వి ఊరుకుంటారు. హైదరాబాద్.. అదీ పాతబస్తీ పచ్చదనమా అనే వెక్కిరింపు తప్పక వారి నవ్వులో కనిపిస్తుంది నాకు. కాని పాత బస్తీ లో ఆ చెట్లు చూస్తే మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడో సంవత్సరాల క్రిందటి మొక్కలు ఇలా పెద్ద పెద్ద వృక్షాలుగా దర్శనమిస్తాయి.. ఎవరన్నారబ్బా !!! హైదరాబాద్ కాంక్రీటుమయమని...?!! ఒకసారి క్రింది ఫోటోలు చూడండి... 

Thursday, 31 August 2017

మా ఇంటి ముందు ఉన్న వేప చెట్ల కొమ్మల మధ్య నుండి కనిపిస్తున్న ఉదయిస్తున్న సూర్యుడుమై కోట్స్ (9)

"మనం ప్రయాణించే మార్గం మంచిదైనప్పుడు, మన మాటలు, చేతలు, రాతలు సరియైనప్పుడు, ఎవరి విమర్శలకు కృంగిపోకూడదు. ఎవరి పొగడ్తలకు పొంగిపోకూడదు."

- జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™Wednesday, 30 August 2017

మా పెరట్లోని అందమైన "తుమ్మి" మొక్కలు... ఆహా!! వీటిలో ఉన్నాయి భలే ఔషదీయ గుణాలు..


గత మూడు సంవత్సరాల నుండి మా ఇంటి పెరట్లో ఈ తుమ్మి మొక్కలు పెరుగుతున్నాయి. వినాయకుడికి ప్రీతి పాత్రమైనది ఈ మొక్క. ప్రతీ సంవత్సరం వినాయక చవితికి మూడు, నాలుగు నెలల ముందే మొలకలొచ్చేస్తాయి. వినాయక చవితి వరకు గుబురుగా పెరిగి, చిన్ని చిన్ని తెల్లని పువ్వులతో కళకళలాడుతాయి. ఈ తెల్లటి పువ్వుల వల్లే తుమ్మి మొక్క మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొదట్లో మాకు వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించేది ఈ మొక్క మా ఇంటి పెరట్లో పెరగడమేమిటని. అది కూడా మేము వాటికోసం ఎలాంటి విత్తనాలు వేయకుండానే. తరువాత తరువాత మాకు అలవాటయిపోయింది. మా ఇంటికి కొత్త వారు ఎవరొచ్చినా, ఈ మొక్కలని చూసి ఆశ్చర్యానికి లోనవడం ఖాయం. ఎందుకంటే ఈ మొక్క సాధరణంగా ఎవరూ ఇళ్ళలో పెంచుకోరు కాబట్టి. తుమ్మి కూర భలే ఉందని, వినాయక చవితి కి తుమ్మి కూరకు కొరతే లేదని కొంతమంది... చవితి రోజు మాకూ కొంత కావాలని మరి కొంతమంది అంటూ ఉంటారు. వారి మాటలు విని, నివ్వి ఊరుకుంటాము. వీరిలా అంటూ ఉంటే లోలోపలో మాకూ గర్వంగానే ఉంటుంది.మా కాలనీలో ఎవరింట్లో కనిపించని మొక్క మా ఇంటి పెరడులో ఉన్నందుకు. మీరు చూస్తున్న ఫొటో నేను తీసిందే.. వినాయక చవితికి ముందు వారమే, ఈ సంవత్సరం గుర్తుగా ఉంటుందని ముందుగానే క్లిక్ చేసి పెట్టుకున్నాను. అదే మీరు చూస్తున్నది. చవితి రోజు వినాయకుడిని పూపత్రితో పూజిస్తాము. అందులో "తుమ్మి" ఒకటి. పండుగ రోజు ఈ మొక్కలని మేము పూజకోసం వాడతాము.. అంతేకాకుండా ఆచారం ప్రకారం ఆ రోజు ఈ మొక్క ఆకులని పప్పు లేదా చింతకాయలతో కలిపి వండుతాము. భలే రుచిగా ఉంటుంది.

Monday, 28 August 2017

మై కోట్స్ (8)

"అకారణంగా మన మనసును ఎవరయినా తమ మాటలతో, చేతలతో గాయపరిస్తే, భరిస్తూ బాధపడుతూ కూర్చోవడమెందుకు? పదే పదే తలచుకుని కృంగిపోవడమెందుకు? మన చిరునవ్వే వారికి సమాధానమవ్వాలి. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలి.
అంతకంటే ముందు మన మనసుని బాధపెట్టిన వారిని క్షమించమని ఆ దేవుడిని ప్రార్థించాలి."

- జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™Monday, 21 August 2017

మా ఇంటి వద్దనున్న అమ్మవారి గుడి ప్రాంగణంలోని వేప మరియు రావి చెట్టు..

మా ఇంటి వద్దనున్న అమ్మవారి గుడి ప్రాంగణంలోని వేప మరియు రావి చెట్టు. మా వాకిట్లో నిలబడి చూస్తే ఇలా కనిపిస్తుంది. ప్రతీ రోజు ఉదయం మరియు సాయంత్రం వినిపించే గుడి గంటల చప్పుడు వింటూ ఉంటే మనసంతా భక్తిమయం అవుతుంది. వీచే గాలికి రావి , వేప చెట్టు యొక్క కొమ్మలు, ఆకులు కదులుతున్న చప్పుళ్ళు చెవికి వినుసొంపుగా అనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం పక్షుల కిలకిలరావాలు... ఆహా!! ఎంత బాగుంటుందో స్వయంగా అనుభవిస్తే కాని తెలియదు..