Monday, 28 November 2016

Patterns తో నేను వేసిన మొదటి డ్రాయింగ్.. ❤

ఇందులో అర్థం ఉందో తెలియదు నాకు.కాని మొదటిసారిగా వేసిన ఆర్ట్ నాకు సంతృప్తిని ఇచ్చింది. అది కూడా నాకు నచ్చిన patterns తో. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను డ్రాయింగ్ వేయడం.. 😊Thursday, 24 November 2016

ఈనాటి ఈ మనిషి..

Image souce-Internet

కన్నుతెరిస్తే జననం .
కన్నుమూస్తే మరణం.

ఈ సృష్టిలో ప్రతీదీ అశాశ్వతమని, చివరికి తాను కూడా ఎప్పటికైనా ఈ మట్టిలోనే కలిసేవాడే అన్న నిజాన్ని తెలిసికూడా, మనిషికి ఈ వెర్రితనమేమిటి???

ప్రేమని కాదని డబ్బు కోసం వెపర్లాడటం...ఎదుటి వారి అంతస్తులు, హోదాన్ని బట్టి వారికి విలువనివ్వడం.. ఊసరవెల్లిలా అప్పటికప్పుడు రంగులు మార్చడం.. ఆత్మీయతలు, మానవత్వం, జాలి,దయ,కరుణ, ప్రేమ వంటి తన మానవీయ లక్షణాలను చేజేతులారా కాలారాసుకొని.. లోభం..మోహం..స్వార్థం.. అహంకారం..అసూయ రాగద్వేషాలను తనలో నింపుకొని, తనకే తెలియని ఒక విధమైన బాధ,అశాంతితో రగిలిపోతూ..అందులోనే కొట్టుమిట్టాడుతున్నాడు.
అసలేమైపోతున్నాడు ఈ మనిషి..??

#జె_శ్వేతాగోదావరి©® (జక్క శ్వేత)
@ 24/11/2016


Wednesday, 16 November 2016

❤ మన స్నేహం ❤

స్వచ్చమైన స్నేహం మనది..
నిష్కల్మషమైన మనసులు మనవి.
ఎన్ని ఆటుపోటులు కలిగినా..
విడదీయరాని బంధం మనది.
నా నేస్తమై వెన్నంటి ఉంటావు..
నా సోదరిలా ప్రేమని పంచుతావు.
జన్మ ఫలమో మరి..
జన్మలో కలిశాము మిత్రులమై.

# జె.శ్వేతాగోదావరి (జక్క శ్వేత)

కవిత నా బెస్ట్ ఫ్రెండ్ అయిన "ఇందుమతి" కి అంకితం.❤Saturday, 5 November 2016

మా చిట్టి చేపపిల్ల "మిన్ను"

"మిన్ను" మా చిన్ని చేపపిల్ల.. అందంగా గులాబి మరియు నారింజ రంగుల కలయికతో చిన్నగా ముద్దుగా ఉండేది. మా పెద్ద తమ్ముడు ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాడు ఈ చిట్టి మిన్నుని. ఈ చిన్న గాజు తొట్టిలో హాయిగా.. చలాకీగా తిరుగుతూ వుండేది. దాదాపుగా సంవత్సరం ఆరు నెలలు మాతోపాటూ ఉంది. మా అమ్మే మిన్నుని బిడ్దలా చూసుకునేది. ప్రేమతో ఫుడ్ వేసేది. ఎప్పటికప్పుడు గాజు తొట్టిని శుభ్రం చేసేది. మేము కూడా మిన్నుతో ఆడుకునేవాళ్ళం. ప్రతీరోజూ..
ఇంత ప్రేమగా చూసుకుంటున్న మా మిన్నుని అపుడప్పుడు బిజీగా ఉండి పట్టించుకునేవాళ్ళంకాదు. ఒక్క అమ్మ తప్ప. ఒకసారి అమ్మ ఏదో పని మీద  ఒకరోజు బయటికివెళుతూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. తరువాత రెండు రోజులకి ఉదయం పైకి తేలుతూ కనిపించింది.
ఈ సంఘటన చూసి మేమంతా నెవ్వరపోయాము. చూస్తూనే తెలిసిపోయింది మిన్ను చనిపోయిందని. ఎప్పుడూ చలాకీగా గాజుతొట్టిలో తిరుగుతూవుండే మిన్ను నిర్జీవంగా పాలిపోయి తేలుతూ ఉంది.ఆ సమయానికి మా అమ్మ కూడ ఇంట్లో లేదు. ఏడ్చేశాము. నేను మా తమ్ముడు తొట్టిలో నుండి దాన్ని జాగ్రత్తగా బయటకి తీసి ఒక బాక్సులో పెట్టి అందులో కొన్ని పువ్వులు వేసి మా పెరట్లోనే పాతిపెట్టేశాము. కొద్దిసేపటికి గాజుతొట్టిని కూడ శుభ్రంచేసి నీళ్ళతో ఎప్పటిలాగే నింపాము. మా ఇంట్లో ఒక్కసారిగా నిశబ్దపు ఛాయలు అలుముకున్నాయి.. క్రితంరోజు వరకు చలాకీగా ఈదుతూ కనిపించే మిన్ను, ఇప్పుడు లేకపోయేసరికి గాజుతొట్టి బోసిపోయింది. దాన్ని అలాగే చూస్తూ కూర్చున్నాము. అసలు బాధ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందేమోనని. ఊహించినట్టే జరిగింది. ఆ రోజు రాత్రి అమ్మ వచ్చిన కొద్దిసేపటికి విషయమంతా చెప్పాము. భావోద్వేగంతో చాలా ఏడ్చేసింది. చాలా అంటే చాలా. మాకూ ఏడ్పొచ్చేసింది. వారం రోజుల వరకు అమ్మ మాములుగా మారలేదు.
ఇది జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన.. మిన్ను మా జీవితంలో ఒక చెరిగిపోని గ్నాపకం. అప్పటినుండి వేరే చేపపిల్లని పెంచుకోవాలని ఆలోచన వచ్చినా అది కూడ మమ్మల్ని వదిలిపోయి ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎదురవుతుందనే భయం. కేవలం మా నిర్లక్ష్యమే మిన్ను ప్రాణం తీసింది. దోషులం ఎవరోకాదు మేమే.
ముగింపు:- చేపపిల్లైనా , ఇల్లైనా, మొక్కైనా లేదా ఏ వస్తువైనాసరే చివరికి మనిషైనా... వాటిపట్ల ప్రేమ మాత్రం ఉంటే సరిపోదు. శ్రద్ధ కూడా ఉండాలి. జాగ్రత్తగా కాపాడుకునే మనసు కూడా ఉండాలి. లేకపోతే మన చేజారిపోతుంది. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. ఏడుస్తూ కూర్చోవడం తప్ప.
MISS YOU MINNU. ❤
# జె.శ్వేతాగోదావరి (జక్క శ్వేత)