Monday, 29 May 2017

కొంపముంచిన నా పిసినారితనం.... 😕😕😕😓😓


మీరు చదివింది నిజమే. నాకు ఇంతకుముందు  ఒకే ఒక్క  నా పిసినారితనం. ఇది కొన్ని సందర్భాలలో నాకు మంచి చేసినా, చాలా సార్లు దెబ్బతీసింది. నా చిన్నప్పుడు మా కుటుంబం అనుభవించిన పేదరికం నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. పొదుపు..పొదుపు..పొదుపు......... చివరికి పిసినారితనం. ఇలా నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. దెబ్బతిన్న ప్రతీసారి అలవాటు మానాలనుకొని నాకు నేను శపథం చేసుకున్నా కూడా కుక్క తోక వంకరలా మళ్ళీ మళ్ళీ అదే పద్దతి. (ఇప్పుడు కాదు.అప్పుడు..)


ఆ మధ్య Facebook లో ఒక అన్నయ్య పరిచయమయ్యారు. పేరు పవన్ కుమార్ (పేరు మార్చాను). మంచి కవి, రచయుత, తెలంగాణా వాది. అప్పుడప్పుడూ వారితో Facebook లో సంభాషించేదాన్ని(Chatting).

ఒకరోజు అన్నయ్య తాను రాసిన కొత్త కథ యొక్క pdf లింక్ నాకు Inbox లో పంపిస్తూ, "ఇది ప్రచురణ కాబోయే కథ. ఒకసారి చదివి నీ అభిప్రాయం చెప్పు" అని మెసెజ్ పెట్టారు. నేను ఆ మెసెజ్ చదివి బదులుగా pdf యొక్క వివరాలు అడిగాను. అనగా pdf size, ఎన్ని బైట్లు కలిగి ఉందో చెప్పమన్నాను. ఈ ప్రశ్న నేను కాదు..నాలో ఉన్న పిసినారితనం అడిగేలా చేసింది(నెట్ బ్యాలెన్స్ ని కూడా kbల్లో లెక్కిస్తూ పొదుపుగా వాడుకోవడం నా అలవాటు).

నా ప్రశ్నకి బదులుగా అన్నయ్య నుండి మెసెజ్ వచ్చింది "ఎక్కువేమి లేదు. 1mb లోపే ఉంటుంది." అని చెప్పారు. చలో చాలా తక్కువే అని ఊపిరి పీల్చుకొని, ఆ కథ యొక్క pdf ఫైల్ ని download చేశాను. అన్నయ్య అన్నట్లు గానే ఫైల్ size చాలా చిన్నది. "సంతోషం" అని మనసులో అనుకొని, పని మొత్తం పూర్తి చేసుకుని సాయంత్రం చదవాలనుకొని నిర్ణయించుకున్నాను.

ఆరోజు సాయంత్రం లోపు ఇంటి పనంతా పూర్తిచేసుకుని, అన్నయ్య పంపించిన కథ చదవడానికి కూర్చున్నాను. మొబైల్ అందుకొని, అందులోని File Manger ని తెరిచాను. ఉదయం download చేసుకున్న ఫైల్ ని క్లిక్ చేస్తే అది తెరుచుకోలేదు. ఒకటి, రెండు, మూడు.. ఎన్ని సార్లు క్లిక్ చేసినా కూడా ఫైల్ తెరుచుకోలేదు. ఇదేం సమస్యరా బాబు అనుకున్నాను.


(నిజానికి స్మార్ట్ ఫోన్ వాడటం అప్పుడప్పుడే మొదలుపెట్టాను.అందుకే pdf ఫైల్ గురించి నాకు అంతగా అవగాహన లేదు.అసలు నిజానికి టెక్నాలజీ గురించి అవగాహన కూడా అప్పుడు అంతంత మాత్రమే.)


ఎలా ఇప్పుడు అని నాలో నేను అనుకుంటుండగానే, ఇంతలో నా మొబైల్ మోగింది. చూస్తే నా స్నేహితురాలు లాస్య. లాస్య, నేను కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని, చివరికి నా సమస్య గూర్చి చర్చించాను. మొబైల్ లో pdf reader app లేనందువల్లే ఫైల్ తెరుచుకోవడం లేదు అని లాస్య నాకు చెప్పింది. అంతేకాదు ఆ స్టోరీ చదవాలంటే ఫైల్ తెరుచుకోవాలి. ఫైల్ తెరుచుకోవాలంటే pdf reader app అవసరం ఉంటుంది. అందుకోసం ప్లే స్టోర్ కి వెళ్ళి App download చేసుకుని, ఇంస్టాల్ చేసుకోవాలి అని చెప్పింది.

అది విని నేను అలవాటు ప్రకారం " App యొక్క size ఎంత ఉంటుంది" అని అడిగాను.

తను నవ్వి, "నా వద్ద ఉన్న app యొక్క size 12 mb" అని చెప్పింది.

అది విని నేను ఒక్కసారిగా విస్తూపోయా. "12 mb???!!!! ఇప్పుడు నేను 12 mb ఖర్చు చేయాలా??" అని లాస్యని అడిగాను.

తను మళ్ళీ నవ్వి, "12 mb కన్నా తక్కువ size లో కూడా ఉంటుంది. కాని కొంచం మంచి app కోసం వెతుకు." అంది. "సరే, థాంక్యూ " అని చెప్పాను. లాస్య ఈ సారి గట్టిగా నవ్వి, "బై పిసినారి పిల్ల" అని కాల్ కట్ చేసింది. కాని ఆ బిరుదును నేను అంతగా పట్టించుకోలేదు.. పట్టించుకోను  కూడా!!! లాస్య ఇచ్చిన సలహాతో గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి, pdf apps కోసం వెతికాను.


చాలా apps కనిపించాయి. కాని నేనేమి తికమక పడలేదు. నాకు తెలుసు నేను ఏ app ఎంచుకోవాలో!! అన్నిటికంటే తక్కువ size ఉన్న pdf app కోసం వెతికితే, ఒక app కంటికి కనిపించింది.


App size - 1.5 mb. సంతోషంగా అనిపించింది. వెంటనే app ని download చేసి ,install చేసేశాను. ఇక అన్నయ్య పంపిన స్టోరీ చదవాడనికి సిద్దమయ్యాను. స్టోరీ రీడింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అన్నయ్య పంపిన కథ ఎలా ఉంటుందో అన్న ఉబలాటం ఒక వైపు, సంతోషం ఒక వైపు.


File manager తెరిచి, అందులో నుండి నేను చదవాల్సిన ఫైల్ ని ఎంచుకుని, దానిపై క్లిక్ చేశాను. వెంటనే అచ్చమైన తెలుగు కథ , అన్నయ్య వ్రాసిన కథ pdf రూపంలో మొబైల్ స్క్రీన్ పై దర్శనం ఇచ్చింది. 'హమ్మయ్య' అనుకుని, చదవడం ప్రారంబించాను. మొదటి వాక్యం చదివాను..రెండవ వాక్యం చదివాను.. చదువుతూనే ఇబ్బంది పడ్దాను. మొదట్లోనే నాకు అచ్చుతప్పులు తప్పులు కనిపించాయి.

అయినా సర్దుకున్నాను. చదవడం కొనసాగించా. మొదటి పేరా, రెండవ పేరా ... చదువుతూ వెళ్ళసాగాను. చదవడానికి సిద్దపడ్డప్పుడు ఉన్న ఉబలాటం, ఉత్సుకత క్రమంగా నాలో తగ్గసాగింది. కథ అధ్బుతంగా ఉంది. కాని ప్రతీ వాక్యంలో అచ్చుతప్పులు.. ప్రతీ పేరాలో తప్పులు దొర్లాయి. ఇదేమిటబ్బా!!! ఇంత మంచి రైటర్ రాసిన కథ లో ఇన్ని తప్పులా??!! ఆశ్చర్యం వేసింది.

కథా చాలా అద్భుతంగా ఉంది. కాని ప్రతీ వాక్యంలో అచ్చుతప్పులు కనిపించాయి. చదవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇదే విషయం వెంటనే inbox లోకి వెళ్ళి, అన్నయ్యకి  చెప్పాను.

వెంటనే అన్నయ్య ఆశ్చర్యంగా " అదేమిటి? అందరూ చాలా బాగుందన్నారు. నీలా ఎప్పుడూ అచ్చుతప్పులు ఉన్నాయని ఎవరూ నాకు చెప్పలేదే. నేను ఒక్క తప్పు లేకుండా రాసి నాకు తెలిసిన వారికి చదవమని ఇచ్చాను." అని అన్నారు.

" ఏమో మరి! తప్పులున్నాయి. నేను నిజమే చెబుతున్నాను" అని చెప్పేశాను.

అన్నయ్య " పోనీలే..వదిలెయ్! చదివినందుకు థాంక్యూ" అని ఒక చిన్న స్మైలీ పెట్టి, మెసెజ్ పంపారు. నేను మెసెజ్ చదివి ఊరుకున్నాను. ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కాసేపు స్టోరీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా.. అంతలో గుర్తొచ్చి, లాస్య కి ఆ pdf ఫైల్ ని వాట్సాప్ లో పంపించాను.

మరుసటి రోజు ఎప్పటిలాగే లాస్య వద్దకి కి వెళ్ళాను. మాటల్లో లాస్య అన్నయ్య వ్రాసిన కథ చాలా చాలా బాగుందని మెచ్చుకుంది. నేను కూడా అవునంటూ తలూపుతూ, "కాని అచ్చుతప్పులు కొన్ని ఉన్నాయి." అని అన్నాను.

ఆ మాట విని, "ఒక్క తప్పు కూడా లేదు. వంకలు పెట్టలేము" అంది.

"లాస్యా సరిగ్గా చూడు..ప్రతీ వాక్యంలో స్పెల్లింగ్ మిస్టేక్స్. అసలు నువ్వు చదవలేదని నా అనుమానం. చూడు.." అంటూ నా మొబైల్ లో ఫైల్ ఒపెన్ చేసి తనకు ఇచ్చాను.

కట్ చేస్తే, లాస్య ముఖం చూడాలి.. ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది.

"ఎన్ని తప్పులున్నాయి కదా?!!" లాస్యను చూస్తూ అన్నాను.

తను నా వైపు తిరిగి, "నేను నమ్మలేకపోతున్నాను శ్వేత"
ఆశ్చర్యంగా. తన ముఖంలో వేల ప్రశ్నలు !!
"శ్వేత!! నీ ఫోన్ నిన్ను మోసం చేసింది." బుల్లెట్ లా దూసుకొచ్చింది ఈ మాట తన నోటి నుండి.

"ఫోన్ మోసం చేయడమేంటి?" అంతే వేగంతో అన్నాను అర్థంకాక. లాస్య తన మొబైల్ లో ఆ కథ చదవమని దాన్ని నాకు ఇచ్చింది. నేను చదవసాగాను. ఇప్పుడు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టడం నా వంతైంది.

"నేను నమ్మలేకపోతున్నాను లాస్య!!!" ఇంతకుముందు లాస్య పలికిన డైలాగ్ నా నోటి నుండి పేలింది. తన మొబైల్ లో ఉన్న స్టొరీ, నా మొబైల్ లో ఉన్న అదే స్టోరీని మార్చి మార్చి చూశాను. "నేను నమ్మలేకపోతున్నాను లాస్య!!" మళ్లీ అదే డైలాగ్ ఇంకింత ఆశ్చర్యంగా.

"నువ్వు install చేసుకున్న pdf app లోనే లోపం ఉంది." టపీమని అంది. నేను ఒక్కసారిగా మళ్లీ నోరెళ్ళబెట్టాను. నాకర్థం కాలేదని నా ముఖం చూస్తూనే తెలిసిపోయిందేమో , తను చెప్పడం కొనసాగించింది.

"కొన్ని నాసిరకం Apps కూడా ఉంటాయి శ్వేత. Install చేసుకునే ముందు అన్ని ఒకటికి రెండుసార్లు చదివి తెలుసుకోవాలి. లేదా ఎవరినైనా అడగాలి. అంతేగాని, ఎలా పడితే అలా, ఏది పడితే అది install చేస్తే ,ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇంకా నయం, మొబైల్ యొక్క సాఫ్టువేరు చెడిపోలేదు. తీసెయ్ ఆ pdf app" అంది కొంచం సీరియస్ గానే.

"నువ్వే తీసెయ్" అని తన చేతికి నా మొబైల్ ఇచ్చాను.
కాని తను అన్న మాటలు విని ఒక్క సారిగా దిమ్మ తిరిగింది నాకు.

లాస్య మాటలు విన్నాకా, అంతకుముందు అన్నయ్యతో నేను కథ లో ఉన్న అచ్చుతప్పుల గురించి చెప్పడం, అన్నయ్య తప్పులేవీ లేవు అనడం, ఇలా మొత్తం గుర్తొచింది. అంతే !!! తల కొట్టేసినట్టు అనిపించింది నాకు. ఒక్కసారిగా నా పరువు గంగలో కలిసిపోయినంత భావన. గంగలో కలసిపోయినట్టు ఏమిటి? నిజంగానే పరువు పోయింది !! అన్నయ్య ముందు !!! సిగ్గుతో నా తలని అర చేతుల్లో దాచుకున్నాను. "ఛ..!!! ఇలా అయిపోయిందేమిటి? నా పరువంతా పోయింది. అన్నయ్య ఏమనుకున్నారో ఏమిటో !! నాకు అసలు చదవడం కూడా రాదు..మొద్దు పిల్ల అనుకోవచ్చు. ఛ !!! " ఇవే మాటలు నా నోటి నుండి రిపీట్ అయ్యాయి కొద్దిసేపటిదాకా. ఆ సమయంలో నేను పడ్డ అవస్థ మాటల్లో చెప్పలేను..అనుభవించిన నాకే తెలుసు.!!!

"అన్నయ్య నా గురించి ఏమనుకున్నారో లాస్య. నా మీద నాకే కోపమొస్తుంది. ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఛీ!! మొద్దు పిల్ల.. చదవడం రాని దద్దమ్మ అని అనుకున్నారేమో." నీరసంగా అన్నాను తనతో.

"అన్నయ్యతో జరిగింది మొత్తం చెప్పు..దానితో పాటు సారీ కూడా చెప్పు."

"ఏమో !! అసలు ఎలా చెప్పాలి? నాకు భయంగా ఉంది. అన్నయ్య కి ఎదురుపడలేను. ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి. మొత్తం పరువు పోయింది. చెప్పిన తరువాత ఏమంటారో?"

"ఏమంటారు?? 'పిసినారి పిల్ల' అని అంటారు."

తలెత్తి తన వైపు చూశాను.

"ఈ పిసినారితనాన్ని మానుకోమని ఎన్ని సార్లు చెప్పాను నీకు. అరె!! ఎవరైనా డేటా బ్యాలెన్స్ లో కూడా పిసినారితనం పాటిస్తారా?!! ప్రపంచంలో నువ్వు తప్ప !! ఎలాంటి ఆలోచన లేకుండా, తక్కువ size apps అని సంభరపడి, ఫోన్ లో install చేసుకుంటే ఇలాగే అవుతుంది. ఇప్పటికైనా పద్దతి మార్చుకో... అని సీరియస్ గా చీవాట్లు పెట్టి, " ఇదిగో నీ మొబైల్ " అని నా చేతిలో పెట్టింది.

లాస్య చెప్పింది నిజమే అనిపించింది. ఎలాగైనా పద్దతి మార్చుకోవాలి !! అంతకంటే ముందు అన్నయ్యకి జరిగిందంతా చెప్పి, సారీ కూడా చెప్పాలి అని మనసులో అనుకొని అక్కడి నుండి బయలుదేరి, ఇంటికి వచ్చాను.


ఆ రోజు మధ్యాహ్నం ఎలాగైనా అన్నయ్యకి జరిగిందా చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. వెంటనే మొబైల్ తీసుకొని, facebook లోకి లాగిన్ అయ్యా. అన్నయ్య కి మెసెజ్ పెట్టడానికి inbox లోకి వెళ్ళి చూస్తే గ్రీన్ లైట్ వెలుగుతూ కంపించింది. ఎందుకో ధైర్యం చాల్లేదు.కాని తప్పదు కదా!! గట్టిగా ఊపిరి పీల్చుకొని, నేను చెప్పాలనుకున్న విషయం టైపు చేసి, send బటన్ నొక్కి, వెంటనే లాగౌట్ అయిపోయా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయా జరగబోయేది ఎలా ఉంటుందో అనే భయంతో.

అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతారో అని నాలో నేను ఆలోచిస్తూనే.. 20 నిమిషాలు గడిచిపోయాయి. 'ఒకసారి వెళ్ళి మెసెజ్ చెక్ చేస్తే?' కాని అంతలోనే ధైర్యం సరిపోక, వెనకడుగు వేశాను. కాని తప్పదు కదా!!! తిరిగి లాగిన్ అయ్యి, మెసెజ్ చూశా. ఒక్కటే మెసెజ్ దర్శనమిచ్చింది. అది కూడా అన్నయ్య పంపినది.

అనుమానంతోనే ఒపెన్ చేసి చూశాను.
"హ హ హ.. ఫర్వాలేదులే పిసినారి పిల్ల. సారీ ఎందుకు?నేనేమి అనుకోలేదు." అని మెసెజ్ సారాంశం.

చదవగానే తల మీద, గుండెలో నుండి టన్ను బరువు ఒక్కసారిగా తీసేసినట్టుగా అనిపించింది. హాయిగా గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. హ్యాపీగా ఫీలయ్యా..  నేననుకున్నంత రభస ఏమీ జరగలేదన్న ఆనందం..అనవసరంగా అందోళన పడ్డానని నన్ను నేనే మనసులో తిట్టుకున్నాను. ఏదైతేనేమి, చివరికి ఆల్ హ్యాపీస్.. ☺☺

కాని ఒక్కటే అనిపించింది నాకు. ఈ 'పిసినారి పిల్ల' అనే బిరుదు తుడిచేసుకోవాలి అని. గట్టిగా నిర్ణయించుకున్నాను ఆ రోజు. ఇక పిసినారితనం వదిలివేయాలని.

ఇదంతా జరిగి 6 నెలలు అవుతోంది. ఈ ఆరు నెలల్లో నాలో చాలా మార్పు వచ్చింది. దాదాపుగా పిసినారితనాన్ని వదిలిపెట్టేశాను. అలాగని దుబారాగా ఖర్చు పెట్టడంలేదు నేను. అవసరమైన ఖర్చులు, అనవసర ఖర్చులు చిట్టాతో బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాను. ఈ ప్రయత్న కాలంలో చాలా విషయాలు తెలిసి వచ్చాయి. నా ఈ పిసినారితనం అలవాటు వల్ల ఎన్ని చిన్న చిన్న ఆనందాలు కోల్పోయానో నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు అలా కాదు. చిన్న చిన్న ఆనందాలను ఒడిసి పట్టుకుంటున్నాను. ఒక్క ఆనందం తప్ప. అవును!!! నేను మనసు పడి కోరుకున్న హాండ్ బ్యాగ్. జనపనారతో తయారయిన ఆ బ్యాగు 3-4 సంవత్సరాల క్రితం కోఠిలో షాపింగ్ చేసేటప్పుడు కనిపించింది. చూడగానే మనసు పారేసుకున్నాను. కాని అప్పుడు నాకున్న పిసినారితనం వల్ల 500 రూపాయలు ఖరీదు చేసే ఆ జ్యూట్ బ్యాగ్ 200 రూపాయలకు బేరమాడినా కుదరకపోవడంతో కొనలేదు. తరువాత మళ్ళీ ఎప్పుడైన నేను కోరుకున్న ధరకు కొనలేకపోతానా...బ్యాగ్ ధర దిగిరాదా అన్న తలబిరుసుతో కొనలేకపోయా. అదేంటో కొన్ని రోజులకు ఆ బ్యాగ్ మార్కెట్ లో కనిపించకుండా మాయమైపోయింది. అప్పుడే నేననుకున్న ధర కంటే 100 రూపాయలు ఎక్కువైనా సరే కొనాల్సింది అని ఇప్పటికి నన్ను నేను తిట్టికుంటాను. ఇప్పటికి కూడా కోఠి, చార్మినార్ లో షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఆ బ్యాగు కోసం నా కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. నా మనసు దోచిన బ్యాగు ఇలా ఉంటుంది. మీకు కనిపిస్తే చెప్పండి. పూర్తి ధరకే , బేరమాడకుండానే కొనేస్తా.. ఒట్టు !!!! 

By :- జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత) ©®™

2 comments:

Suresh Kumar said...

Nice...Sethu..☺
INkaa neelo pisinaritanam pooyinda..? Naaku doute...😇

Jekka Swetha said...

Haha..thnx Veena