Wednesday, 30 August 2017

మా పెరట్లోని అందమైన "తుమ్మి" మొక్కలు... ఆహా!! వీటిలో ఉన్నాయి భలే ఔషదీయ గుణాలు..


గత మూడు సంవత్సరాల నుండి మా ఇంటి పెరట్లో ఈ తుమ్మి మొక్కలు పెరుగుతున్నాయి. వినాయకుడికి ప్రీతి పాత్రమైనది ఈ మొక్క. ప్రతీ సంవత్సరం వినాయక చవితికి మూడు, నాలుగు నెలల ముందే మొలకలొచ్చేస్తాయి. వినాయక చవితి వరకు గుబురుగా పెరిగి, చిన్ని చిన్ని తెల్లని పువ్వులతో కళకళలాడుతాయి. ఈ తెల్లటి పువ్వుల వల్లే తుమ్మి మొక్క మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొదట్లో మాకు వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించేది ఈ మొక్క మా ఇంటి పెరట్లో పెరగడమేమిటని. అది కూడా మేము వాటికోసం ఎలాంటి విత్తనాలు వేయకుండానే. తరువాత తరువాత మాకు అలవాటయిపోయింది. మా ఇంటికి కొత్త వారు ఎవరొచ్చినా, ఈ మొక్కలని చూసి ఆశ్చర్యానికి లోనవడం ఖాయం. ఎందుకంటే ఈ మొక్క సాధరణంగా ఎవరూ ఇళ్ళలో పెంచుకోరు కాబట్టి. తుమ్మి కూర భలే ఉందని, వినాయక చవితి కి తుమ్మి కూరకు కొరతే లేదని కొంతమంది... చవితి రోజు మాకూ కొంత కావాలని మరి కొంతమంది అంటూ ఉంటారు. వారి మాటలు విని, నివ్వి ఊరుకుంటాము. వీరిలా అంటూ ఉంటే లోలోపలో మాకూ గర్వంగానే ఉంటుంది.మా కాలనీలో ఎవరింట్లో కనిపించని మొక్క మా ఇంటి పెరడులో ఉన్నందుకు. మీరు చూస్తున్న ఫొటో నేను తీసిందే.. వినాయక చవితికి ముందు వారమే, ఈ సంవత్సరం గుర్తుగా ఉంటుందని ముందుగానే క్లిక్ చేసి పెట్టుకున్నాను. అదే మీరు చూస్తున్నది. చవితి రోజు వినాయకుడిని పూపత్రితో పూజిస్తాము. అందులో "తుమ్మి" ఒకటి. పండుగ రోజు ఈ మొక్కలని మేము పూజకోసం వాడతాము.. అంతేకాకుండా ఆచారం ప్రకారం ఆ రోజు ఈ మొక్క ఆకులని పప్పు లేదా చింతకాయలతో కలిపి వండుతాము. భలే రుచిగా ఉంటుంది."తుమ్మి" మొక్కకు మరో పేరు "ద్రోణ". వృక్షశాస్త్రం లో దీనికి గల శాస్త్రీయ నామం " Leucas aspera ".
వివిధ భాషాలలో తుమ్మి ని వివిధ రకాలుగా పిలుస్తారు. ఉదాహరణకు..
హిందీ : చోటాకల్కుస
కన్నడ : తుంబెగిడ
తమిళం : తుంబై
బెంగాలీ : చోటాకల్కుస
మలయాళం : తుంబ

ఈ మొక్క ఎక్కువగా భారతదేశం మరియు తూర్పు ఆసియాలోని బంజరుభూముల్లో పెరుగుతుంది.

మొదట్లో కేవలం వినాయక చవితికి మాత్రమే ఈ మొక్కను వాడతారనే అపోహ మాకుండేది. ఈ మధ్యే ఆ అపోహ పటాపంచలైంది. ఈ మొక్క యొక్క ప్రతీ భాగంలో ఎన్నో ఔషదీయ గుణాలు దాగున్నాయనే విషయం తర్వాత తెలిసి ఆశ్చర్యము వేసింది. ఈ తుమ్మి మొక్క యొక్క ఉపయోగాలు క్రింది విధంగా ఉన్నాయి చూడండి.

 తుమ్మి మొక్క యొక్క ఆకులని ఆహారంగా వాడుతారు. చింతకాయలు లేదా పప్పుతో కలిపి వండుతారు.

 పాము లేదా తేలు కరిచినప్పుడు, కరిచిన చోట దీని యొక్క ఆకుల పసరును పూస్తారు. అంతేకాక, ఇతర కీటకాల కాటుకు కూడా పసరుని వాడతారు.

 దురద, వాపు, మానని గాయాలు వంటి వాటికి తుమ్మి ఆకుల యొక్క పసరు అద్భుతమైన ఔషధం.

 గజ్జి వంటి చర్మ వ్యాధులకు తుమ్మి ఆకుల పసరు చాలా బాగా పనిచేస్తుంది.

 మలబద్ధకాన్ని పోగొడుతుంది. మరియు కడుపులోని నులిపురుగులని చంపివేస్తుంది.

 జలుబు, పడిశం, ఆస్తమా, ఉబ్బసం, దురద మంటలు, జ్వరం,  కామెర్లకు తుమ్మి యొక్క కషాయం మంచి మందుగా పనిచేస్తుంది.

 శరీర నొప్పులు, పక్షవాతం వంటి వ్యాధులకు తుమ్మి ఆకుల పసరును వాడతారు.

 జలుబు నుండి ఉపశమనానికి తుమ్మి పువ్వుల సిరప్ ని సేవిస్తారు.

ముగింపు :-
ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ తుమ్మి మొక్క ఎక్కువగా గ్రామాల్లో, గిరిజన, కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంది. తుమ్మి మొక్క యొక్క ఉపయోగాలు వారికి తెలిసినంతగా మనకు తెలియదు. ఆయుర్వేదం ప్రకారం "ప్రకృతి" మనకు దేవుడిచ్చిన ఒక వరం. అందులోని ప్రతీ మొక్క, చివరకి మనము దేనికీ పనికిరాదని భావించే గరక గడ్డిలో కూడా ఔషద గుణాలు దాగి ఉన్నాయి.

ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం.

No comments: