Tuesday, 5 September 2017

హైదరాబాద్ లోని పాత బస్తీ పచ్చని అందాలు...

గమనిక:- ఈ పోస్ట్ లోని ప్రతీ ఫోటోగ్రాఫ్ నేను స్వయంగా తీసినదే.

హైదరాబాద్ పేరు వినగానే బిర్యాని, ముత్యాలు, చార్మినార్ - గోల్కొండ - సాలార్ జంగ్ వంటి చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. వీటికి ఓల్డ్ సిటీ ( హైదరాబాద్ పాత బస్తీ ) చాలా ప్రసిద్ది. హిందూ-ముస్లిం అనే భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటారు. పండగలు ఇంకా ఏ సంభరాలైనా కలిసి జరుపుకుంటారు... ఇక నా వరకైతే వీటన్నింటితో పాటు పాత బస్తీ లో అక్కడక్కడా కనిపించే పచ్చదనమంటే చాలా చాలా ఇష్టం. నేనేమి అంత పెద్ద ఫోటోగ్రాఫర్ ని కాదు. కాని ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఈ నా ఫోటోగ్రఫీ కి అస్తమానం నా మొబైల్ బలైపోతుంది ( నా వద్ద కెమెరా లేదు. నా ఆండ్రాయిడ్ మొబైల్ తప్ప. ఫోటో తీయాలని అనిపించినప్పుడల్లా నా మొబైల్ తో పని కానిస్తాను)

క్రింది ఫొటోగ్రాఫ్స్ అన్నీ నేను ఈ మధ్య తీసినవే. మేము ఎక్కువగా పి వి నర్సింహారావు ఫ్లై ఓవర్ నుండి చార్మినార్ దారిలో ప్రయాణిస్తూ ఉంటాము. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్ గంజ్ ఇవన్నీ కూడా పాతబస్తీ పరిధిలోకి వస్తాయి. చాంద్రాయణగుట్ట నుండి చార్మినార్ వెళ్ళే దారిలో రోడ్డుకి రెండు వైపులా ఉండే పచ్చదనం నన్ను కట్టిపడేస్తుంది అని ఎవరితోనైనా చెబితే నవ్వి ఊరుకుంటారు. హైదరాబాద్.. అదీ పాతబస్తీ పచ్చదనమా అనే వెక్కిరింపు తప్పక వారి నవ్వులో కనిపిస్తుంది నాకు. కాని పాత బస్తీ లో ఆ చెట్లు చూస్తే మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడో సంవత్సరాల క్రిందటి మొక్కలు ఇలా పెద్ద పెద్ద వృక్షాలుగా దర్శనమిస్తాయి.. ఎవరన్నారబ్బా !!! హైదరాబాద్ కాంక్రీటుమయమని...?!! ఒకసారి క్రింది ఫోటోలు చూడండి... 



చార్మినార్ కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది ఈ చెట్టు. చూడటానికి క్రిస్మస్ ట్ర్రీ లా కనిపిస్తుంది. నా వైపు కూడా ఒకసారి చూడండి అని ఈ వృక్షం దారినపోయే వారితో అంటున్నట్టు లేదు..?!!

ఫలక్ నుమా - చాంద్రాయణగుట్ట దారి మధ్యలో గల బ్రిడ్జ్ మీదుగా క్రిందకి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పచ్చని చెట్ల నడుమ ఒక కాలనీ ఉంది. ఫోటోను చూస్తే అడవేమో అన్నట్టు లేదూ..?!!

ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రాంతం పేరు.. " చాంద్రాయణగుట్ట బస్ స్టాప్ "

ఫలక్ నుమా కి వెళ్ళే దారిలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడే ప్రసిద్ధి గాంచిన ఫలక్ నుమా ప్యాలెస్ ఉంది.

ఇది కూడా ఫలక్ నుమా ప్రాంతం. పైన మీరు చూసిన చోటికి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్ళాలి.

చాంద్రాయణగుట్ట కి వెళ్ళే దారిలో కుడివైపు ఈ పచ్చని చెట్లు దర్శనమిస్తాయి.

ఇవే కాకుండా ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పచ్చదనం కనిపిస్తుంది. నా ఈ ప్రయత్నం పాఠకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. 

Posted by :- జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)